
భారత హాకీ జట్టు జెర్సీ విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇటీవల హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు కాషాయ రంగు జెర్సీలను ప్రధాన కిట్‌గా ధరించాయి. అయితే ఈ నిర్ణయంపై మాజీ ఆటగాళ్లు, అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆసియా క్రీడలకు భారత జట్లు మరోసారి సంప్రదాయ నీలం రంగు జెర్సీలతో బరిలోకి దిగనున్నాయి. హాకీ ఇండియా నీలం రంగును ప్రధాన జెర్సీగా ఎంపిక చేయగా, కాషాయ రంగును రెండో కిట్‌గా ఉంచింది.
హాకీ ప్రపంచకప్‌కు ముందు జెర్సీ రంగును మార్చాలని హాకీ ఇండియా నిర్ణయించింది. నీలం రంగు జెర్సీ, నీలం రంగులో ఉండే హాకీ మైదానంతో కలిసిపోవడం వల్ల ఆటగాళ్లకు దృశ్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కారణంగా చెప్పింది. ఆటగాళ్లు, కోచ్‌ల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ప్రత్యామ్నాయ రంగులపై చర్చించి చివరకు కాషాయాన్ని ఎంపిక చేసినట్లు హాకీ ఇండియా తెలిపింది. భారత జాతీయ జెండాలో కాషాయం ఉండటం కూడా ఆ రంగును ఎంపిక చేయడానికి ఒక కారణంగా పేర్కొంది.
అయితే కాషాయ జెర్సీ నిర్ణయం పెద్ద వివాదానికి దారితీసింది. భారత మాజీ కెప్టెన్లు పర్గత్ సింగ్, ధన్‌రాజ్ పిళ్లై, అజిత్ పాల్ సింగ్, వీరెన్ రస్కిన్హా తదితరులు సంప్రదాయ నీలం రంగును మార్చడంపై ప్రశ్నలు లేవనెత్తారు. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ కూడా జెర్సీ రంగు మార్చే నిర్ణయం తనకు ముందుగా తెలియజేయలేదని, ఎగ్జిక్యూటివ్ బోర్డు ముందు కూడా ఈ అంశాన్ని చర్చించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జెర్సీ రంగు అంశం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ప్రపంచకప్ తర్వాత ఆసియా క్రీడలకు ముందు హాకీ ఇండియా తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారత ఒలింపిక్ సంఘం జట్టు కిట్‌కు సంబంధించిన ఎంపికలను కోరగా, హాకీ ఇండియా నీలం రంగును మొదటి ఎంపికగా, కాషాయాన్ని రెండో ఎంపికగా పేర్కొంది. దీంతో ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు మళ్లీ తమ సంప్రదాయ నీలం జెర్సీలతో కనిపించనున్నాయి. ఈ మార్పుతో భారత హాకీ అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.
ఆసియా క్రీడలు భారత హాకీ జట్లకు ఎంతో కీలకంగా మారాయి. ఈ టోర్నమెంట్లో మంచి ప్రదర్శనతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో జట్లు సిద్ధమవుతున్నాయి. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. వరుసగా ఐదో ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని సాధించాలని పురుషుల జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల జట్టు కూడా 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉంది.


