
ఆర్థిక వ్యవస్థ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన ఈ వృద్ధిపై కొన్ని వర్గాలు, ఆర్థిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీడీపీ లెక్కల విధానం, బేస్ ఇయర్ మార్పులు, ధరల డిఫ్లేటర్ల కారణంగా వృద్ధి రేటు ఎక్కువగా కనిపిస్తోందనే ప్రశ్నలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) తాజాగా వివరణ ఇచ్చింది. జీడీపీ వృద్ధి సంఖ్యలకు ఎలాంటి ‘మెకానికల్ బూస్ట్’ ఇవ్వలేదని స్పష్టం చేసింది.
MoSPI ప్రకారం, జీడీపీ లెక్కల్లో మార్పులు సాధారణ గణాంక ప్రక్రియలో భాగమే. కొత్త, మెరుగైన డేటా అందుబాటులోకి రావడం, కొత్త సూచీలను చేర్చడం, లెక్కల పద్ధతులను నవీకరించడం వంటి కారణాలతో గత గణాంకాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వీటిని ప్రస్తుత వృద్ధి రేటును కృత్రిమంగా పెంచేందుకు చేసిన చర్యలుగా చూడకూడదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయంగా ఆమోదించబడిన గణాంక ప్రమాణాల ప్రకారమే జీడీపీ అంచనాలను రూపొందిస్తున్నామని తెలిపింది.
మరో ముఖ్యమైన అంశంగా తయారీ రంగం ధరలపై వచ్చిన ప్రశ్నలకు కూడా MoSPI సమాధానం ఇచ్చింది. తయారీ రంగంలో ఇన్పుట్, అవుట్‌పుట్ ధరలు పెరుగుతున్నప్పటికీ, GVA డిఫ్లేటర్ మైనస్‌లో ఎలా నమోదైందనే సందేహం వ్యక్తమైంది. దీనిపై మంత్రిత్వ శాఖ వివరణ ఇస్తూ, GVA డిఫ్లేటర్‌ను తయారీ వస్తువుల ధరలు లేదా ముడి పదార్థాల ధరలతో నేరుగా పోల్చకూడదని తెలిపింది. డబుల్ డిఫ్లేషన్ విధానంలో అవుట్‌పుట్, మధ్యంతర వినియోగాన్ని విడివిడిగా ధరల ప్రభావం నుంచి సర్దుబాటు చేసి వాస్తవ GVAను లెక్కిస్తామని వివరించింది.
తాజా అధికారిక గణాంకాల ప్రకారం, 2026-27 తొలి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ ₹81.36 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ఇది గత ఏడాది ఇదే కాలంలోని ₹75.46 లక్షల కోట్లతో పోలిస్తే 7.8 శాతం వృద్ధి. ఇదే సమయంలో వాస్తవ GVA 8.2 శాతం పెరిగింది. సేవల రంగం 10 శాతం, ద్వితీయ రంగం 8.6 శాతం వృద్ధి సాధించగా, ప్రైవేట్ వినియోగ వ్యయం 7.1 శాతం, స్థిర మూలధన పెట్టుబడులు 11.9 శాతం పెరిగాయి.
మొత్తంగా 7.8 శాతం జీడీపీ వృద్ధి గణాంకాలు కేవలం లెక్కల మార్పుల ఫలితం కాదని MoSPI స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, సేవలు, పెట్టుబడులు, వినియోగం వంటి అనేక అంశాల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాలు రూపొందించామని తెలిపింది. గణాంకాలపై వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం వివరణాత్మక సమాచారాన్ని విడుదల చేసింది. దీంతో భారత ఆర్థిక వృద్ధిపై కొనసాగుతున్న చర్చకు MoSPI వివరణ మరింత స్పష్టతనిచ్చింది.


