
పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతుండటంతో తనలో కొత్త ఉత్సాహం నెలకొందని తెలిపారు. నిర్ణయించిన గడువులోనే ప్రధాన పనులు పూర్తవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ధవళేశ్వరం పర్యటన అనంతరం పోలవరం చేరుకున్న సీఎం తొలుత ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం హిల్‌వ్యూ ప్రాంతం నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్-2, పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాలు, ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి అధికారుల నుంచి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. జలవనరుల శాఖ అధికారులు, ఇంజినీర్లు ప్రాజెక్టు ప్రస్తుత స్థితి, నిర్మాణ ప్రణాళికలను సీఎంకు వివరించారు. గంటన్నరపాటు ఆయన ప్రాజెక్టు ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల్లో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు మొత్తం పనుల్లో సుమారు 89 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. నిర్వాసితుల భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో నిర్వాసితులకు రూ.2,250 కోట్ల పరిహారం అందించినట్లు వెల్లడించారు.
ఆగస్టు 14 నాటికి ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను అందించి జలహారతి ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాదిలో విశాఖపట్నానికి గోదావరి జలాలను తరలించే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయి జలకళ సంతరించుకున్న రోజున దానిని దేశానికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. నేవిగేషన్ పరంగా పోలవరం దేశంలోనే ఆదర్శ ప్రాజెక్టుగా నిలుస్తుందని, వరదల సమయంలో మునిగే గండి పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు కూడా చేపడతామని వివరించారు.
ఈ పర్యటనలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సీఎంతో పాటు పాల్గొన్నారు. పోలవరం ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను స్థానిక నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రి విస్తరణ, తాగునీటి శుద్ధి కేంద్రం, రహదారుల నిర్మాణం, పర్యాటక అభివృద్ధి, సాగునీటి సదుపాయాలపై వినతిపత్రాలు అందజేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర వ్యవసాయం, తాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.


