
కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు (TDP Mahanadu)పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. మహానాడు సభలో ఆయన మాట్లాడుతూ, ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన మొదటి మహానాడు అని, అది దేవుని గడప అయిన కడపలో జరగడం విశేషం అని అన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన స్పందన అద్భుతంగా ఉందని, మహానాడు సూపర్ హిట్‌గా నిలిచిందని తెలిపారు.
“ఎన్నోసార్లు కడపకు వచ్చాను. కానీ ఈసారి వచ్చిన జనసంద్రం చూస్తే ఎంతో ధైర్యం వచ్చిందని” అన్నారు చంద్రబాబు. కొన్ని శక్తులు కడపలో మహానాడు పెట్టడం అనవసరం అన్నారు కానీ, కడప టీడీపీ గడ్డ అని నిరూపించేందుకు ఇక్కడే మహానాడు నిర్వహించామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో కడప గడపలో మార్పు రావాలని చెప్పానని, ఇప్పుడు ఆ మాట నిజమైందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో కడప జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 లో 7 స్థానాలు కైవసం చేసుకున్నామని చెప్పారు. రాయలసీమలో మొత్తం 52 స్థానాల్లో 45 చోట్ల గెలుపొంది ప్రజలు మనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టామని చెప్పారు. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ ప్రజల తీర్పు అర్థం చేసుకోలేదని చంద్రబాబు విమర్శించారు.
“తెలుగుదేశం అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు, సేవ కోసం ఏర్పడిన పార్టీ” అని స్పష్టం చేశారు. తాము ఎన్నో అవమానాలు, అక్రమ కేసులు, నిర్బంధాలను ఎదుర్కొన్నామని, ఈ విజయం కార్యకర్తల త్యాగాల ఫలమని తెలిపారు. “ఇటీవల 30 ఏళ్లను వెనక్కి నెట్టిన పాలన నుంచి రాష్ట్రాన్ని బయట పడేశాం. ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాం” అన్నారు.
కోడూరు నుంచి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన కార్యకర్తను ప్రస్తావిస్తూ, “ఇలాంటి నిజమైన కార్యకర్తలు ఎక్కడా ఉండరు, వీరితో ఉన్న మన పార్టీకి ఇది అదృష్టం” అని పేర్కొన్నారు. మహానాడు విజయాన్ని ప్రజలకే అంకితంగా ప్రకటించిన చంద్రబాబు, “మీ విశ్వాసానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను” అని స్పష్టం చేశారు..