
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా భారీ హైప్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. ప్రత్యేకంగా “హంగ్రీ చీతా”, “ఫైర్ స్ట్రామ్” వంటి పాటలు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.
ఇటీవల బాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో “ఓజీ” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిరాయ్ టీమ్‌తో పాటు తేజా సజ్జా, రితికా నాయక్, శ్రియ, జగపతిబాబు పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా షో చివర్లో ఫైర్ స్ట్రామ్ సాంగ్‌ను ప్లే చేయగా స్టూడియో మొత్తం ఉత్సాహభరిత వాతావరణంగా మారింది.
కపిల్ శర్మతో పాటు అతిథులందరూ పాటకు స్టెప్పులేయగా, జగపతిబాబు కూడా పవన్ పాటకు డాన్స్ చేయడం విశేషం. ఈ సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు “ఓజీ హీట్ టాలీవుడ్‌ను దాటి బాలీవుడ్‌లోనూ ప్రభావం చూపుతోంది” అని వ్యాఖ్యానిస్తున్నారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్ సాంగ్స్‌కి ఊపిరి పోసిందని వారు ప్రశంసిస్తున్నారు.
ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కథానాయికగా ప్రియాంక ఆరుళ్ మోహన్, విలన్‌గా ఇమ్రాన్ హస్మీ నటిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఉన్న హైప్, సోషల్ మీడియాలో సృష్టిస్తున్న రచ్చను బట్టి, ఓజీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.