
మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) తాజాగా తన వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ఆయన స్పష్టంగా పేర్కొన్నది ఏమిటంటే, తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం నిలిపేసిన పథకాలను తిరిగి ప్రారంభిస్తామని. కోవై జిల్లా పొల్లాచ్చి నియోజకవర్గంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రైతులు, నేత కార్మికులు, పరిశ్రమల యజమానులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో ఈపీఎస్ ప్రసంగానికి ముందుగా పలువురు ప్రతినిధులు తమ సమస్యలను వెల్లడించారు. ముఖ్యంగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వ కాలంలో అమలైన పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయ కారణాలతో డీఎంకే నిలిపివేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక వాటిని తిరిగి అమలు చేస్తామని ఈపీఎస్ స్పష్టంచేశారు.
ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, మాజీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్‌తో పాటు పలు సీనియర్ నేతలు హాజరయ్యారు. ప్రజల సమస్యలపై పార్టీ తరఫున పోరాడతామని, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు మాత్రమే తీసుకుంటామని ఈపీఎస్ తెలిపారు. ఇది సభలో హాజరైన ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.
ఇక, ఈ నెల 22న శివగంగ జిల్లాలో ధర్నా నిర్వహించనున్నట్లు ఈపీఎస్ మరో ప్రకటనలో తెలిపారు. మానామదురై మున్సిపాలిటీ పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ ధర్నా జరుగుతుందని ఆయన వివరించారు. మానామదురై సిప్కాట్ పారిశ్రామికవాడలో మెడికల్ బయో వ్యర్థాల రీసైక్లింగ్ కర్మాగారం ప్రారంభం అవ్వడంపై స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేశారని, అయినా డీఎంకే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు.
ఈ నేపధ్యంలో మానామదురై తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని ఈపీఎస్ ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వ వైఖరిని ప్రజల ముందుంచడమే ఈ నిరసన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలపై కఠినంగా నిలబడి, ప్రజాస్వామ్య మార్గంలో పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.