
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఆరోగ్య రహస్యాన్ని ఇటీవల వెల్లడించారు. రోజువారీ రాజకీయ కార్యక్రమాలు, పరిపాలనలో బిజీగా ఉండే మోదీ ఎప్పుడూ యవ్వనంగా, ఉత్సాహంగా ఎలా కనిపిస్తారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఈ సందర్బంగా, తాను ఏడాదిలో 300 రోజులు ఒకే ఆహారాన్ని తీసుకుంటానని చెప్పడం అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ఆయా ఆహారం మఖానా అని ఆయన స్వయంగా వెల్లడించారు. మఖానా యొక్క ప్రయోజనాలు, ఆరోగ్యానికి కలిగించే మేలు గురించి మోదీ వివరించడంతో దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
మోదీ తన ఆరోగ్యం వెనుక మఖానా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మఖానా ఒక సూపర్ ఫుడ్ అని, ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుందని వివరించారు. ‘‘365 రోజుల్లో 300 రోజులు మఖానా నా ఆహారంలో తప్పకుండా ఉంటుంది’’ అని మోదీ వెల్లడించారు. ఇది తక్కువ కొవ్వు శాతం కలిగి ఉండటం, అధిక ప్రోటీన్, మినరల్స్ ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా, మఖానా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
భారతీయ ఆహారంలో మఖానాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ప్రత్యేకంగా బిహార్ రాష్ట్రంలో విస్తృతంగా పండించబడుతోంది. బిహార్‌లోని భగల్‌పూర్ ప్రాంతంలో జరిగిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమంలో మోదీ మఖానా ప్రాముఖ్యతను మరోసారి ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో మఖానా ఉత్పత్తిని పెంచాలని ఆకాంక్షించారు. భారతదేశ రైతులు మఖానా సాగు, ఉత్పత్తి, మార్కెటింగ్‌లో మరింత ముందుకు రావాలని మోదీ సూచించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బిహార్ రాష్ట్రానికి మఖానా బోర్డు మంజూరు చేయడం గమనార్హం. రూ. 100 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ బోర్డు ద్వారా మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ మెరుగుపడనుంది. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు, వారి ఆదాయాన్ని పెంచేందుకు ఈ బోర్డు సహాయపడుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బిహార్ రైతులకు ఇది గొప్ప అవకాశమని మోదీ పేర్కొన్నారు.
ప్రధానికి ప్రత్యేక సత్కారం మోదీ మఖానాపై చూపిస్తున్న ఆసక్తిని గుర్తించి, బిహార్‌లో జరిగిన సభలో స్థానిక నాయకులు మఖానా దండ వేసి స్వాగతం పలికారు. ఇది మోదీ ప్రసంగంలో ప్రత్యేక ప్రస్తావనకు కారణమైంది. ‘‘దేశవ్యాప్తంగా ప్రజలు మఖానాను ఆహారంగా తీసుకుంటారు. అయితే, దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి’’ అని మోదీ అన్నారు. తన ఆరోగ్య రహస్యాన్ని మఖానాతో ముడిపెట్టి చెప్పిన మోదీ మాటలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.