
ఓఎన్‌జీసీ విజయంపై షేర్ హోల్డర్లకు సమాచారం లేకపోవడంపై విమర్శలు
ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఓఎన్‌జీసీ రిలయన్స్ నుండి రూ.20,000-25,000 కోట్లు రికవరీ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఈ విషయాన్ని షేర్ హోల్డర్లకు తెలపకపోవడంపై మార్కెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సెబీ నియమాలను ఉల్లంఘించినందుకు ఓఎన్‌జీసీపై చర్యలు తీసుకోవాలనే వాదన కూడా ఉంది.
భారతీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నిర్దేశించిన లిస్టింగ్ రెగ్యులేషన్ల ప్రకారం (LODR) ఇలాంటి ముఖ్యమైన అంశాలను కంపెనీలు తప్పనిసరిగా వెల్లడించాలి. కానీ ONGC ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తీర్పు వచ్చిన మరుసటి రోజే రిలయన్స్ తమ షేర్ హోల్డర్లకు సమాచారం అందించి, సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయనున్నట్లు తెలిపింది. కానీ ONGC మాత్రం మౌనం వహించింది.
నిపుణుల ప్రకారం, ఎటువంటి స్టే ఆర్డర్ లేకపోవడంతో, ONGC తక్షణమే రిలయన్స్ నుంచి చెల్లింపును డిమాండ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు కంపెనీ తదుపరి చర్యల గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు, కోర్టు ఉత్తర్వును కూడా బహిరంగంగా ప్రకటించలేదు.ఓఎన్‌జీసీ షేర్ హోల్డర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి.