
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి ఘాటుగా విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను దారుణంగా వంచించిందని ఆరోపించారు. పదేళ్ల పాటు యువతను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పించారని, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. ‘‘నేను చెప్పింది నిజమైతేనే మాకు ఓటు వేయండి’’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా రేవంత్
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రభుత్వానికి, పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ఆ పార్టీకి ఇప్పుడేమీ దిక్కులేక ఫామ్ హౌస్‌లోనే కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోటీకి కూడా దిగకపోవడం వారి అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని పేర్కొన్నారు. పోటీ చేయకుండా కాంగ్రెస్ ను విమర్శించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఉద్యోగ నియామకాలు
తమ ప్రభుత్వం సాధికారతను నిరూపించుకునేలా 55,163 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని, వరంగల్‌కు చెందిన దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం కల్పించినట్లు వివరించారు.
రైతుల సంక్షేమంపై ఫోకస్
నిజామాబాద్ రైతులు పంజాబ్ రైతులతో పోటీపడి పంటలు పండిస్తున్నారని, వారికి అవసరమైన మద్దతు అందించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. రైతు రుణమాఫీని సకాలంలో అమలు చేసినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పుల వడ్డీగా ఇప్పటి వరకు 75 వేల కోట్లు చెల్లించామని వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపుతాను సీఎం అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందుతున్నాయని రేవంత్ స్పష్టం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు 8 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని, వాటిని రాబోయే రోజుల్లో నెలకు వెయ్యి కోట్ల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం పాలనలో పారదర్శకతను కాపాడేందుకు కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.