
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హై స్పీడ్ రైల్ కారిడార్‌ల ద్వారా రాష్ట్ర రాజధాని అమరావతి భవిష్యత్ రూపురేఖలే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి మీదుగా హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు పరుగులు పెడితే, అలాగే అమరావతి నుంచి నేరుగా బెంగళూరుకు హై స్పీడ్ రైల్ అనుసంధానం కల్పిస్తే రాజధాని అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఒక వ్యూహాత్మక ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
కేంద్ర బడ్జెట్‌లో ఇప్పటికే హైదరాబాద్–అమరావతి–గుంటూరు–తిరుపతి–చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో పాటు హైదరాబాద్–బెంగళూరు, బెంగళూరు–చెన్నై హై స్పీడ్ కారిడార్‌లను కూడా కేంద్రం ప్రతిపాదించింది. బెంగళూరు–చెన్నై కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్లనుండటం అమరావతికి కీలక అవకాశంగా మారిందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో చిత్తూరు నుంచి తిరుపతి వరకు సుమారు 75 కిలోమీటర్ల వ్యూహాత్మక రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే, బెంగళూరు–అమరావతి మధ్య నేరుగా హై స్పీడ్ రైల్ అనుసంధానం సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తక్కువ ఖర్చుతోనే మరో హై స్పీడ్ కారిడార్ లభించే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే అంశాన్ని ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవకు కూడా సీఎం వివరించినట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలా జరిగితే హైదరాబాద్–చెన్నై, బెంగళూరు–చెన్నై అనే రెండు ప్రధాన హై స్పీడ్ రైల్ కారిడార్‌లు అమరావతికి అనుసంధానమవుతాయి. దీని ద్వారా రాజధానికి దేశంలోని కీలక మెట్రో నగరాలతో వేగవంతమైన కనెక్టివిటీ లభిస్తుంది.
ఈ హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్ అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా, దక్షిణ భారతదేశంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ప్రాంతీయంగా ఏకీకృతం చేసే శక్తివంతమైన మౌలిక సదుపాయంగా నిలుస్తుంది. వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు పెరగడంతో అమరావతి ఒక గ్లోబల్ నగరంగా ఎదిగే అవకాశాలు మరింత బలపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


