
ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’ థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ట్రైలర్‌లో చూపించిన ఓల్డ్ గెటప్ లుక్ సినిమా మొత్తం కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా దర్శకుడు మారుతిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ఆ తర్వాతి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. చివరికి ఫైనల్ రన్‌లో ప్లాప్‌గా నిలిచింది.
థియేట్రికల్ రన్ దాదాపు ముగియడంతో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి మొత్తం ఓటీటీ రిలీజ్‌పై పడింది. థియేటర్లకు వెళ్లలేకపోయిన వారు, మళ్లీ ఒకసారి సినిమా చూడాలని భావించిన వారు ‘రాజా సాబ్’ డిజిటల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ఈ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి.
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషలైన తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు హాట్‌స్టార్ వెల్లడించింది. అయితే హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా కావడంతో హిందీ ప్రేక్షకుల స్పందనపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.
వాస్తవానికి సంక్రాంతి సీజన్‌లో ఎన్నో సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అయితే వాటిలో చాలా సినిమాలు ఇంకా ఓటీటీలోకి రాలేదు. కానీ ‘ది రాజా సాబ్’ మాత్రం కేవలం 28 రోజుల థియేట్రికల్ రన్ తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి రావడం గమనార్హం. నెల రోజుల్లోపే థియేటర్ నుంచి మొబైల్, టీవీ స్క్రీన్‌లకు రావడం ఈ సినిమాకు ప్రత్యేకతగా మారింది.
థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, ఓటీటీలో మాత్రం ‘రాజా సాబ్’కు మంచి స్పందన వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులు, ప్రభాస్ ఫ్యాన్స్ డిజిటల్‌లో ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఓటీటీ విడుదలతో అయినా ‘రాజా సాబ్’కు కొత్త జీవం దక్కుతుందేమో చూడాలి.


