spot_img
spot_img
HomePolitical Newsదేశానికి పునాదులు వేసిన మహనీయులు.

దేశానికి పునాదులు వేసిన మహనీయులు.

హైదరాబాద్ గాంధీభవన్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను టీపీసీసీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. జాతీయ గీతాలాపనతో పాటు స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ నేతలు దేశభక్తి భావాన్ని చాటారు. గాంధీభవన్ ప్రాంగణమంతా జాతీయ పతాకాలతో, కాంగ్రెస్ జెండాలతో సందడి నెలకొంది.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… స్వాతంత్య్ర ఉద్యమంలో పాత్ర లేని శక్తులు 2014 నుంచి దేశాన్ని పాలిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారే వాటిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరును తొలగించాలనే ఉద్దేశంతోనే మన్రేగా వంటి పథకాలను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రాలు కనిపిస్తాయని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ, లౌకికవాదానికి తూట్లు పొడుస్తూ, కులాలు–మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 2014 వరకు యూపీఏ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఇప్పుడు వికాస దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణను అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నామని మహేష్ గౌడ్ తెలిపారు. కుల సర్వే చేపట్టడంతో యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

కులగణన బిల్లులను బీజేపీ అడ్డుకుంటోందని, ఆ కుట్రలను ప్రజలు గుర్తించాలని టీపీసీసీ చీఫ్ కోరారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం విజయవంతమైందని, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. నెహ్రూ దూరదృష్టి, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి నాయకులు దేశానికి గట్టి పునాదులు వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ అజారుద్దీన్, షబ్బీర్ అలీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments