
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో ఘనంగా నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణతో పాటు అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఈ మహాసభలు నిర్వహించబడటం అభినందనీయం. దేశవిదేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రేమికులు, పండితులు, సాహితీవేత్తలు ఈ సభల్లో పాల్గొని తెలుగు భాష గొప్పతనాన్ని చాటారు. ఈ వేదిక తెలుగు భాషా వైభవాన్ని మరోసారి గుర్తు చేసింది.
ఈ సందర్భంగా కవిత్రయం నుంచి శ్రీకృష్ణ దేవరాయుల ఆస్థానంలోని అష్టదిగ్గజాల వరకు తెలుగు సాహిత్యానికి వెలుగులు దిద్దిన మహనీయులను స్మరించుకున్నాం. గురజాడ అప్పారావు నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు ఆధునిక సాహిత్యాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దిన కవులు, రచయితల సేవలను గుర్తుచేసుకున్నాం. వారి రచనలు తెలుగు భాషకు శక్తిని, సామాజిక స్పృహను అందించాయని ఈ సందర్భంగా ప్రస్తావించాం.
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ గారి సేవలను స్మరించుకున్నాం. వారి జీవితాలు మనకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నాం. భాష, సంస్కృతి కోసం వారు చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేనివని స్పష్టం చేశాం.
భాష ఉంటేనే జాతి ఉనికి ఉంటుందన్న సత్యాన్ని ఈ మహాసభలు మరోసారి గుర్తుచేశాయి. మన సంస్కృతిని, మన జాతిని ముందుకు నడిపించే శక్తి మన మాతృభాష తెలుగుకే ఉందని వివరించాం. నేటి యువత తెలుగు భాషను ప్రేమించాలి, గౌరవించాలి, దాన్ని నిత్యజీవితంలో ఉపయోగించాలన్న సందేశాన్ని ఇచ్చాం. తెలుగు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాం.
సభికుల కోరిక మేరకు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులను ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని ఈ సందర్భంగా ప్రకటించాను. అలాగే వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులు, ఆస్థాన కవులను నియమించాలన్న విన్నపాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చాం. తెలుగు భాషా వైభవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం, ప్రజలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ మహాసభల ద్వారా స్పష్టమైంది.


