
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఏపీ సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు మాత్రమే కాకుండా వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో నిర్దేశిత గడువులోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో చర్చించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు జరగేలా చూడాలని సూచించారు. ఏపీ అంతటా ఒకే విధమైన బ్యాంక్ గ్యారెంటీలు అమలు చేయాలని, కొనుగోలు ప్రక్రియలో ఏకరూపత ఉండాలని దిశానిర్దేశం చేశారు. ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ విధానం మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.
ధాన్యం కొనుగోళ్లలో పాల్గొనే మిల్లర్లు ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలని సీఎం ఆదేశించారు. రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని, మధ్యవర్తిత్వం తగ్గించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. పాఠశాలల్లో దశలవారీగా కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులను భవిష్యత్‌కు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
వచ్చే రెండు సంవత్సరాల పాటు నాలుగు విడతల్లో విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించే యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం సూచించారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులకు క్వాంటం టెక్నాలజీపై ప్రాథమిక అవగాహన కల్పించాలని ఆదేశించారు. 2026 జనవరి చివర్లో స్టూడెంట్స్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహించి, విద్యార్థులు తమ ఇన్నోవేషన్లు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు.


