
విద్యార్థుల భవితకు బాటలు వేస్తున్న ఏపీ ప్రభుత్వం సింఘానియా గ్రూప్‌తో కీలక ఒప్పంద
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా విధానంలో నూతన సంస్కరణలు తీసుకువస్తూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు సింఘానియా గ్రూప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. జాతీయ విద్యా విధానం లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో సింఘానియా గ్రూప్ (రేమండ్స్), ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంలో భాగంగా సింఘానియా స్కూల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా, నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపడతారు. తొలుత తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ, విద్యా నాణ్యత, సాంకేతిక అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు చేపడతారు. పాఠశాల నిర్వహణలో మార్పులు తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఐదేళ్ల పాటు అమలు చేసే ఈ కార్యక్రమం ద్వారా లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని నారా లోకేష్ వివరించారు. తిరుపతి తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడలకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ విద్యా రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటిదాకా అమలు చేస్తున్న మూస విధానాలకు స్వస్తి చెప్పి, విద్యార్థుల్లో క్రియేటివిటీ పెంచేలా కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నట్లు వివరించారు. కాలేజీ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థికి కాలేజీ నుంచి బయటకు రాగానే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు.
ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులను నైపుణ్యవంతంగా తయారు చేయడమే తమ లక్ష్యమని సింఘానియా గ్రూపు తెలిపింది. విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచి, తద్వారా విద్య నాణ్యతను పెంచుతామని పేర్కొంది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంతో పాటు ఉపాధ్యాయులకు కూడా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల రాష్ట్ర విద్యా రంగంలో గుణాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నారు.
ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థకు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు.