
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఊపందుకుంది. ఎన్నికల హామీ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనవరి 26న ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల ప్రక్రియ వేగంగా సాగుతుండగా, జారీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలు జరుగుతుండగా, ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వీలైనంత త్వరగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మొదలుపెట్టాలని సీఎం సూచించారు.
ఈ సందర్భంగా, కొత్త రేషన్ కార్డు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. పాత కార్డుల్లా కాకుండా స్మార్ట్ కార్డుల తరహాలో రేషన్ కార్డును అందించాలని ప్రభుత్వం ముందు నుంచి యోచిస్తోంది. “ఒకే రాష్ట్రం.. ఒకే కార్డు” నినాదంలో భాగంగా, అన్ని ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడేలా రేషన్ కార్డును చిప్‌తో సహా, ఏటీఎం కార్డు సైజులో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కార్డుల డిజైన్‌ను సిద్ధం చేస్తున్నారు.
కొత్త రేషన్ కార్డుపై ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫొటో, మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, మధ్యలో ప్రభుత్వ లోగో ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. కొత్త రేషన్ కార్డును గృహిణి పేరు మీద జారీ చేయనుండగా, కార్డుపై కుటుంబ సభ్యుల ఫోటో పెట్టాలా లేక గృహిణి ఫోటో మాత్రమే పెట్టాలా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కుటుంబం ఫోటో పెట్టాలా లేదంటే అదే స్థానంలో కుటుంబ సభ్యుల వివరాలు ప్రింట్ చేయాలా అనేది అధికారులు ఆలోచిస్తున్నారు. కార్డు వెనుకవైపు లబ్దిదారుడి అడ్రస్, రేషన్ షాప్ నెంబర్, ఇతర వివరాలు ఉండనున్నాయి. రేషన్ కార్డుకు ఆధార్ కార్డు మాదిరిగా క్యూఆర్ కోడ్ పెడతారా లేదా చిప్ పెడతారా అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే స్మార్ట్ కార్డు తరహాలో రేషన్ కార్డులు జారీ చేస్తుండగా, వాటి మాదిరిగానే తెలంగాణలోనూ కొత్త రేషన్ కార్డులు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పలు డిజైన్లను పరిశీలించి, కొన్నింటిని అధికారులకు సూచించినట్టు సమాచారం. సీఎం సూచనలతో కొత్త రేషన్ కార్డుల ప్రింటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, త్వరలోనే లబ్దిదారులకు అందించనున్నారు.