
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీం ఇండియా ఆటగాళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు భారత ఆటగాళ్ల భార్యలు లేదా వారి కుటుంబ సభ్యులు కూడా వారితోనే ఉండవచ్చని వెల్లడించింది. దీంతో టీం ఇండియా ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్లకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. మాములుగా అయితే టోర్నమెంట్ ఆడే సమయంలో ఆటగాళ్ల కుటుంబాలు వారితో ఉండకూడదనే నిబంధన ఉంది.
కొత్త నిబంధనలు
ఈ ప్రకటన నేపథ్యంలో ఆటగాళ్ల భార్య లేదా వారి కుటుంబంలోని ఎవరైనా సభ్యుడు మైదానంలో కూర్చుని ఛాంపియన్స్ ట్రోఫీని ఆస్వాదించవచ్చు. ఇటీవలే బీసీసీఐ దీనిని నిషేధించింది. ఫిబ్రవరి 20 నుంచి 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం తన ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించనుంది. నివేదికల ప్రకారం ఈ నిర్ణయంతో BCCI కొన్ని షరతులు కూడా విధించినట్లు తెలుస్తోంది. మొదటి షరతు ఏమిటంటే, ఆటగాళ్ళు తమ కుటుంబ సభ్యులను ఒక మ్యాచ్ కోసం మాత్రమే తమతో తీసుకురావచ్చు. దీని అర్థం కుటుంబ సభ్యులు టోర్నమెంట్ సమయంలో అన్ని మ్యాచ్‌లకు హాజరు కాలేరు. కానీ ఒక మ్యాచ్‌కు మాత్రమే హాజరు అవుతారు. ఇది కాకుండా కుటుంబ సభ్యుల అన్ని ఖర్చులు ప్రయాణం, జీవన వ్యయాలు, ఇతర ఖర్చులు కూడా ఆటగాళ్లే స్వయంగా భరించాలి. బీసీసీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే కుటుంబ సభ్యుల సందర్శన జరుగుతుందని బీసీసీఐ చెబుతోంది. ప్రతిదీ సరైన పద్ధతిలో జరిగేలా చూసుకోవడం దీని ఉద్దేశం.
తొలి మ్యాచ్ ఎప్పుడు?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. కానీ టీం ఇండియా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తన ఆటను ప్రారంభించనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న టీం ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల కుటుంబాలు కనిపిస్తాయా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరిగే టోర్నమెంట్ సందర్భంగా ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను ఎన్ని మ్యాచ్‌లకు తీసుకువస్తారో చూడాలి మరి. ఆటగాళ్ల మానసిక, భావోద్వేగ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా ఆటగాళ్లు మానసికంగా సిద్ధంగా ఉండటంలో సహాయకరంగా ఉంటుందని భావిస్తున్నారు.