
బాలకృష్ణ, ఆయనకు వీరసింహారెడ్డి వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలుపుతున్న విషయం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఇప్పటివరకు యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన గోపీచంద్ మలినేని, ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్ అయిన పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ బాలయ్య కెరీర్లో మరో కీలక మలుపుగా నిలవనుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
అఖండ సినిమా తరువాత బాలకృష్ణ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రాజకీయంగా, సినీ రంగంలోనూ ఆయన ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన అఖండ తాండవంతో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించారు. బాలయ్య మాస్ ఎనర్జీకి థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఒక సినిమా షూటింగ్లో ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టే విషయంలో బాలయ్య ఎప్పుడూ ముందుంటారు.
ఇదే క్రమంలో NBK 111గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవంబర్ 26న గ్రాండ్‌గా ఓపెనింగ్ జరిగింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ‘మహారాజు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లో రెండు భిన్న కాలాలకు చెందిన బాలకృష్ణ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.
ఈ భారీ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాంతార సినిమాకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్‌ను ఎంపిక చేయడం మేకర్స్ విజన్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
అఖండ-2 సక్సెస్‌తో ఉత్సాహంగా ఉన్న బాలయ్య, వచ్చే ఏడాది జనవరి నుంచే NBK 111 షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది పీరియాడిక్ డ్రామా కావడంతో కథకు తగ్గ చారిత్రక, అద్భుతమైన లొకేషన్ల కోసం యూనిట్ ప్రత్యేకంగా వేట మొదలుపెట్టింది. బడ్జెట్, మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా, బాలయ్య కెరీర్లో మరో మైలురాయిగా నిలిచేలా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు గోపీచంద్ మలినేని విశేష కృషి చేస్తున్నారు.


