
ఈరోజు ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధి, బోధన ప్రమాణాల పెంపు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించాను. ముఖ్యంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా విద్యా ప్రమాణాలు మరింతగా పెంపొందించవచ్చని అభిప్రాయపడ్డాను. అందుకే ఈ నెల 27వ తేదీన రాష్ట్రంలోని 78 మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి సింగపూర్ పంపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించాను.
అలాగే, ఈ నెల 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించాలన్న సూచనలు ఇచ్చాను. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని, పౌర హక్కులను, కర్తవ్యాలను గమనించి అవగాహన పొందేలా చూడాలని అధికారులను ఆదేశించాను.
గత ఏడాది మాదిరిగానే డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించాను. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని సూచించాను. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ఉన్న సవాళ్లను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టవచ్చని తెలియజేశాను.
అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, ముఖ్యంగా డిఇఓలు, ఎంఇఓలు పాఠశాల స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఆదేశించాను. ఈ-ఆఫీసు వ్యవస్థను బలోపేతం చేసి, పారదర్శకతతో కూడిన పరిపాలన అందించాలని కూడా సూచించాను.
లీప్-1 గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్)పై వందరోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించాను. రాష్ట్రవ్యాప్తంగా కడప మోడల్ స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసి, విద్యార్థులకు మెరుగైన పోషకాహారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాను. ఈ చర్యలు విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చుతాయని నమ్మకం వ్యక్తం చేశాను.


