
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రాల్లో ది రాజాసాబ్ (The Raja Saab) ఒకటి. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించాయి. మాస్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ సినిమాలు వాయిదాలకు గురవడం కొత్తేమీ కాదు. ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు చిన్నా చితకా ఆలస్యాలు తప్పకుంటాయి. ది రాజాసాబ్ కూడా ఆ జాబితాలో చేరింది. మొదటగా డిసెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేయగా, తరువాత అది వాయిదా పడి సంక్రాంతి రిలీజ్‌గా మార్చారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది అని మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా మరోసారి సినిమా వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ రూమర్స్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. “ది రాజాసాబ్ వాయిదా పడుతుందనే వార్తల్లో నిజం లేదు. ప్రభాస్ అభిమానులు నిశ్చింతగా ఉండాలి. మేము సంక్రాంతికే సినిమాను విడుదల చేస్తాం” అని స్పష్టం చేశారు. అంతేకాదు, డిసెంబర్లో అమెరికాలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మరి మాస్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడో అన్న ఆసక్తి మాత్రం పెరిగిపోతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ సినిమాపై విశేష నమ్మకం వ్యక్తం చేస్తోంది.
సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు పెద్ద సినిమాలు పోటీకి వస్తుండగా, ప్రభాస్ ది రాజాసాబ్ కూడా అదే సమయంలో రిలీజ్ అవ్వడం బాక్సాఫీస్ వద్ద భారీ హడావిడి సృష్టించనుంది. మరి ప్రభాస్ ఈ సారి పండగ విజయాన్ని సాధిస్తాడో చూడాలి.


