
టాలీవుడ్ సినీ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన సినిమాగా “శివ” పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన ఈ చిత్రం ఆ కాలంలోనే ఒక సంచలనాన్ని సృష్టించింది. కాలేజ్ నేపథ్యంలో గ్యాంగ్ వార్స్, రాజకీయాల ముసుగులో జరుగుతున్న హింస, మరియు ఒక విద్యార్థి తిరుగుబాటు కథగా ఈ సినిమా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఆ అద్భుతం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
“శివ” సినిమాను ఇప్పుడు 4K ఫార్మాట్లో కొత్తగా రీ-రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 14న థియేటర్లలో ప్రేక్షకులను మరోసారి ఆ అనుభూతి ఎదురుచూస్తోంది. నాగార్జున మరియు వర్మ ఈ రీ-రిలీజ్‌కి కొత్త సినిమాలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా మీద టాలీవుడ్ స్టార్స్ చెప్పిన అభిప్రాయాలను వీడియోల రూపంలో విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన 4K ట్రైలర్ ప్రేక్షకులలో పాత జ్ఞాపకాలను మళ్లీ మేల్కొలిపింది.
దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మణిరత్నం, శేఖర్ కమ్ముల, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ తదితరులు ఈ సినిమాను “ఐకానిక్” చిత్రమని వర్ణించారు. మహేష్ బాబు ఈ సినిమాను పది సార్లు చూశానని చెబితే, అల్లు అర్జున్ “శివ లేకపోతే మన సినిమా ఇంతగా ఎదగదు” అని అన్నాడు.
ట్రైలర్లో చూపినట్లుగా, శివ ఒక సాధారణ కాలేజ్ విద్యార్థి, కానీ అన్యాయాన్ని తట్టుకోలేని వ్యక్తి. కాలేజ్‌లో జరుగుతున్న రౌడీయిజం, రాజకీయ ప్రభావం, భవానీ అనే స్థానిక రౌడీకి ఎదురు నిలిచే ధైర్యం అతనిలో ఉంది. జేడీ అనే స్టూడెంట్ లీడర్‌తో గొడవలతో మొదలైన కథ, భవానీతో యుద్ధం వరకు సాగుతుంది.
సామాజిక బాధ్యత, విద్యార్థి ధైర్యం, రాజకీయ అవినీతి, వ్యవస్థపై తిరుగుబాటు – ఇవన్నీ కలిపి “శివ” సినిమాను ఎప్పటికీ మరవలేనిదిగా నిలబెట్టాయి. ఇప్పుడు రీ-రిలీజ్‌తో కొత్త తరం ప్రేక్షకులు ఆ విజువల్ మాస్టర్‌పీస్‌ను అనుభవించే అవకాశం రానుంది. ఈసారి ‘శివ’ ఎంత హడావుడి చేస్తుందో చూడాలి.


