
55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ (Kerala State Film Awards 2025) ఘనంగా ప్రకటించబడ్డాయి. ఈ అవార్డులు ప్రతి ఏడాది మలయాళ సినీ పరిశ్రమలో ప్రతిభ కనబరిచిన కళాకారులను, ఉత్తమ చిత్రాలను గౌరవించడానికి కేరళ ప్రభుత్వం అందిస్తుంది. ఈ సంవత్సరం కూడా పోటీ తీవ్రంగా ఉండగా, 2024లో ప్రేక్షకులను అలరించిన అనేక చిత్రాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఈసారి మలయాళ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys) చిత్రం అవార్డుల వర్షం కురిపించింది.
‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా ఏకంగా తొమ్మిది విభాగాల్లో అవార్డులు గెలుచుకుని రికార్డ్ సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం వంటి విభాగాల్లో ఈ సినిమా దాదాపు ఆధిపత్యం చెలాయించింది. ఈ విజయంతో మలయాళ సినిమా స్థాయిని మరోసారి జాతీయస్థాయిలో చాటింది. ప్రేక్షకులను ఆకట్టుకున్న యథార్థ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా, మలయాళ యువతలో విశేషమైన స్పందనను రేపింది.
ఉత్తమ నటుడిగా మమ్ముట్టి ఎంపిక కాగా, ఆయన అద్భుతమైన నటనకు జ్యూరీ సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఉత్తమ నటి అవార్డు షామ్లా హజ్మా సొంతం చేసుకుంది. ఈ ఏడాది మహిళా కేంద్రిత కథల ప్రాధాన్యం పెరిగినట్లు జ్యూరీ పేర్కొంది. అంతేకాకుండా అనేక కొత్త దర్శకులు, రచయితలు తమ ప్రతిభను ఈ ఏడాది ప్రదర్శించి సినీప్రపంచానికి సరికొత్త ఊపునిచ్చారు.
ఈ అవార్డుల జాబితా ప్రకటన సందర్భంగా కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సినీమా సృజనాత్మకత, సామాజిక చైతన్యం రెండింటినీ సమన్వయం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ నేతృత్వంలో ఆరుగురు కమిటీ సభ్యులు కఠిన పరిశీలన తర్వాత ఈ లిస్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఇక మొత్తం మీద, 55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ మలయాళ సినీ పరిశ్రమలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఆధిపత్యం చాటగా, మమ్ముట్టి, షామ్లా హజ్మా వంటి ప్రతిభావంతుల కళాకారులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.


