
అదృష్టం ఆవగింజ అయితే… దరిద్రం దబ్బకాయంత అని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) కెరీర్‌కు సరిపోతుంది. మొదటి సినిమా పెళ్లి సందD విడుదలకు ముందే వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ఆమె, ఆ తరువాత వచ్చిన ధమాకాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ విజయంతో గోల్డెన్ లెగ్‌గా పేరుపొంది, టాప్ హీరోలందరి జాబితాలోకి చేరింది. కానీ ఆ తరువాత వచ్చిన సినిమాలు మాత్రం ఆమె అదృష్టానికి తగిన ఫలితాలు ఇవ్వలేదు.
స్కంద, ఆదికేశవ, గుంటూరు కారం, ఎక్స్‌ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్, జూనియర్ — ఇలా శ్రీలీల నటించిన అన్ని చిత్రాలు ఒకదాని తరువాత ఒకటి బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. మధ్యలో భగవంత్ కేసరి హిట్ అయినా, అది ఎక్కువగా బాలయ్య కే క్రెడిట్ అయిపోయింది. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ ద్వారా మంచి గుర్తింపు దక్కినప్పటికీ, అది తాత్కాలికమైన విజయమే అయ్యింది. ఈ మధ్య వచ్చిన మాస్ జాతర కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఇప్పుడు మొత్తం ఫోకస్ శ్రీలీల కొత్త సినిమా ‘పరాశక్తి’ మీద ఉంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తుండగా, సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. రవి మోహన్, అధర్వతో పాటు శ్రీలీల కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు కేవలం పాటలు, రొమాన్స్‌కే పరిమితమైన ఆమె, ఈ సినిమాలో మాత్రం పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తుందని సమాచారం.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సుధా కొంగర డైరెక్షన్‌లో మహిళా ప్రధానమైన పాత్రతో శ్రీలీల మరో మారు తన ప్రతిభను నిరూపించుకోవాలని చూస్తోంది. ఈ సినిమా విజయం ఆమె కెరీర్‌కు ఒక కొత్త శకం తెరవొచ్చు.
కానీ, ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే మాత్రం శ్రీలీల కెరీర్ మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది. అందుకే అభిమానులు, సినీ వర్గాలంతా ఇప్పుడు ఒక్కటే మాట చెబుతున్నారు —
“ఇక ఆ పరాశక్తినే కాపాడాలమ్మా…!”


