
మా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసిన ప్రత్యేకమైన రోజు ఇది. నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు గారి దివ్య ఆశీస్సులతో ఆయన తనయుడు నారా రోహిత్, శిరీష వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించాం. ఈ వేడుక మా కుటుంబానికి మరపురాని జ్ఞాపకం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి, జీవితాంతం ఆనందం, ఐశ్వర్యం కలగాలని మనస్పూర్తిగా కోరుకున్నాం. ఈ పావన సందర్భం మా ఇంట్లో పండుగలా మారి, ప్రతి ఒక్కరి హృదయాల్లో సంతోషాన్ని నింపింది.
వివాహ వేడుకలో ప్రతి అంశం సాంప్రదాయంతో, ఆత్మీయతతో నిండి ఉంది. బంధువులు, మిత్రులు, ఆత్మీయులు అందరూ ఒక్కచోట చేరి రోహిత్, శిరీషలకు ఆశీస్సులు అందించారు. సంగీతం, నవ్వులు, ఆత్మీయ సంభాషణలతో ఆ వేదిక ఆనందోత్సవంగా మారింది. నూతన దంపతుల ముఖాల్లో కనిపించిన ఆనందం అందరి హృదయాలను హత్తుకుంది.
నారా రోహిత్ జీవితంలో ఈ కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న వేళ, కుటుంబ సభ్యులందరికీ గర్వం, సంతోషం కలిగింది. రోహిత్ ఒక ఇంటివాడవుతున్న ఈ శుభ ఘడియలో మా కుటుంబం అంతా ఒక త్రివేణిగా కలిసిపోయిన భావన కలిగింది. దివంగత నారా రామ్మూర్తి నాయుడు గారి ఆశీస్సులు ఈ జంటపై ఎల్లప్పుడూ ఉంటాయని మా నమ్మకం.
మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేడుకలో పాల్గొని మా ఆనందాన్ని రెట్టింపు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఈ కొత్త బంధం రోహిత్, శిరీష జీవితాల్లో ప్రేమ, పరస్పర గౌరవం, ఆనందం నింపాలని కోరుకుంటున్నాం. వారి దాంపత్య జీవితం సంతోషభరితంగా, విజయవంతంగా సాగాలని ఆశిస్తున్నాం.


