
టాలీవుడ్ సినీ ప్రపంచంలో దర్శకుల భార్యలు కూడా సృజనాత్మకతలో వెనుకబడటం లేదు. కొందరు సినిమాలకు కథలు రాయగా, మరికొందరు కాస్ట్యూమ్ డిజైనర్లుగా, ఇంకొందరు నిర్మాతలుగా తమ ప్రతిభను చాటుతున్నారు. సినీ కుటుంబాల వారసత్వాన్ని కొనసాగిస్తూ, కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వస్తున్నారు.
ముందుగా చెప్పుకోవాల్సినది దర్శకుడు నాగ్ అశ్విన్ భార్య ప్రియాంక దత్. ఆమె తండ్రి సి.అశ్వినీదత్ టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత. తండ్రి మార్గంలోనే ప్రియాంక, ఆమె సోదరి స్వప్న దత్‌లు నిర్మాతలుగా ఎదిగారు. తమ వైజయంతీ మూవీస్ మరియు స్వప్న సినిమా బ్యానర్ల ద్వారా అనేక చిత్రాలు నిర్మించి, తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతానికి ‘ప్రాజెక్ట్ K’ వంటి పెద్ద చిత్రాల నిర్మాణంలో వీరు బిజీగా ఉన్నారు.
అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య లక్ష్మీ సౌజన్య కూడా నిర్మాతగా మంచి పేరు సంపాదించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ల ద్వారా సూర్యదేవర నాగవంశీతో కలిసి ఆమె నిర్మించిన సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ‘డీజే టిల్లు’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో విజయం సాధించి, ఇప్పుడు రవితేజ హీరోగా నటించిన ‘మాస్ జాతర’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మరోవైపు ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ భార్య తబిత కూడా నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కింద రూపొందిన ‘కుమారి 21 ఎఫ్’ విజయం తర్వాత, తబిత ఇప్పుడు ‘కుమారి 22 ఎఫ్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ చిత్రానికి కూడా సమర్పకురాలిగా పని చేశారు.
ఇక దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి భార్య యలమంచిలి గీత కూడా నిర్మాణ రంగంలో ప్రవేశించారు. ఆమె తన భర్త దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ప్రియాంక దత్, లక్ష్మీ సౌజన్య, తబిత, గీత వంటి మహిళలు దర్శకుల భార్యలుగా మాత్రమే కాకుండా, నిర్మాతలుగా కూడా టాలీవుడ్‌కు కొత్త ఊపును తీసుకొస్తున్నారు. వీరిని చూసి మరెంత మంది సినీ కుటుంబాల మహిళలు నిర్మాణ రంగంలోకి వస్తారో చూడాలి.


