
ప్రముఖ హాస్య నటుడు సతీశ్ షా ఇక లేరు అనే వార్త బాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శనివారం ఆయన అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. దాదాపు 250కు పైగా చిత్రాలలో నటించి, అనేక టెలివిజన్ షోలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన సతీశ్ షా, భారతీయ హాస్య రంగంలో ఒక గొప్ప నక్షత్రం.
బుల్లితెరపై ఆయన చేసిన హాస్యం ఎప్పటికీ మరువలేనిది. 1984లో వచ్చిన యే జో హై జిందగీ సీరీస్‌లో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను కన్నీళ్లు తెప్పించేంత నవ్వించేది. ఆ తరువాత వచ్చిన ఫిల్మీ చక్కర్, ఘర్ జమాయ్, టాప్ 10, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్, కామెడీ సర్కస్ వంటి షోలలో ఆయన అద్భుతమైన టైమింగ్, మేనరిజం, సహజమైన హాస్యం వల్ల ప్రేక్షకులు ఎంతో ఇష్టపడ్డారు.
1951 జూన్ 25న ముంబైలో జన్మించిన సతీశ్ షా పూర్వీకులది కచ్ గుజరాత్. ఆయన తన కెరీర్‌ను 1978లో వచ్చిన అరవింద్ దేశాయ్ కి అజీబ్ దస్తాన్ సినిమాతో ప్రారంభించారు. కానీ 1983లో వచ్చిన జానే భీ దో యారో చిత్రం ఆయనకు అపారమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆయన హాస్య నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
అనేక తరం నటులతో కలిసి పని చేసిన సతీశ్ షా, హాస్యానికి కొత్త అర్థం చెప్పారు. ఆయన మాటల హాస్యమే కాకుండా, ముద్రలతో, ముఖ భావాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. సినీ పరిశ్రమలో ఆయనను అందరూ “హాస్యానికి జీవం పోసిన నటుడు” అని ప్రశంసించారు.
గత కొంతకాలంగా సతీశ్ షా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయించుకున్నారు కానీ పరిస్థితి విషమించి శనివారం ఆయన మృతి చెందారు. మాధవన్, బోమన్ ఇరానీ, అనుపమ్ ఖేర్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనున్నాయి. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరదని అభిమానులు చెబుతున్నారు.


