
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ఆయన చేతిలో ఇప్పుడు నాలుగు విభిన్న జానర్స్ సినిమాలు ఉన్నాయి. ఒకటి విడుదలకు సిద్ధమవుతుండగా, మరొకటి షూటింగ్ దశలో ఉంది. మిగతా రెండు ప్రాజెక్టులు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, ఈ నాలుగు సినిమాలు రవితేజ కెరీర్‌లో కొత్త మార్పు తేవచ్చనే అంచనాలు ఉన్నాయి.
మొదటగా రవితేజ 75వ చిత్రం మాస్ జాతర అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ మంచి స్పందన పొందాయి. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నదని చిత్ర యూనిట్ చెబుతోంది.
రవితేజ 76వ చిత్రం ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్పెయిన్‌లో షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోంది. రాబోయే సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
రవితేజ 77వ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘ఖుషీ’ వంటి సినిమాలతో ఫీల్‌గుడ్ ఎమోషన్స్‌ను అందించిన శివ నిర్వాణ ఈసారి థ్రిల్లర్ డ్రామాను తెరకెక్కించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో రవితేజ తన వయసుకు తగ్గ సీరియస్ రోల్ చేయనున్నాడని సమాచారం.
ఇక రవితేజ 78వ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం సూపర్ హీరో కాన్సెప్ట్‌పై తెరకెక్కబోతుందట. సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇలా నాలుగు విభిన్న జానర్స్‌తో రవితేజ తన కెరీర్‌లో కొత్త దశను ఆరంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలు ఆయనను తిరిగి విజయపథంలోకి తీసుకువెళ్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.


