
ఈరోజు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా రంగంలో చేపట్టిన చర్యలు, భవిష్యత్ ప్రణాళికలపై విస్తృత చర్చ జరిగింది. ప్రతి సంవత్సరం డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని మరోసారి స్పష్టంగా తెలియజేశాను.
నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్షను నిర్వహించి, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించాం. డీఎస్సీ పరీక్షను మార్చిలో నిర్వహించి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కొత్త ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాం. అభ్యర్థులంతా ముందుగానే సన్నద్ధం కావాలని సూచించాను.
అదేవిధంగా, విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించాను. బేస్‌లైన్ టెస్ట్ నిర్వహించి, ప్రతి విద్యార్థి స్థాయిని అంచనా వేసి, ఆ ఆధారంగా బోధనా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించాను. ఈ పరీక్షలు విద్యా నాణ్యత పెంపు దిశగా కీలకమైన అడుగుగా నిలుస్తాయి.
విద్యా రంగంలో ప్రతిభ కనబరచిన ఉత్తమ ఉపాధ్యాయులను ప్రోత్సహించడంపై కూడా దృష్టి సారించాము. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 78 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సింగపూర్ విద్యా పర్యటనకు పంపించేందుకు చర్యలు చేపడతామని ప్రకటించాను. ఈ పర్యటన ద్వారా వారు అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాలను అధ్యయనం చేసి, వాటిని మన రాష్ట్ర పాఠశాలల్లో అమలు చేయగలరని ఆశిస్తున్నాం.
మొత్తం మీద, ఈరోజు జరిగిన సమీక్ష సమావేశం విద్యా వ్యవస్థలో సంస్కరణలకు, ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో పారదర్శకతకు దారితీసే మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. టెట్, డీఎస్సీ పరీక్షల ద్వారా కొత్త ఉపాధ్యాయులను నియమించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసాను.


