
హైదరాబాద్ పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్లో (MPM టైమ్ స్క్వేర్ మాల్) బుధవారం కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ మల్టీప్లెక్స్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” సినిమా స్క్రీనింగ్‌తో ఈ థియేటర్ ప్రారంభోత్సవం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మల్టీప్లెక్స్‌ను విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంతో నిర్మించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, నటుడు సిద్దు జొన్నలగడ్డ, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ, అలాగే ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ “కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్ అద్భుతంగా నిర్మించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇక్కడి అనుభవాన్ని ఆస్వాదించాలి” అని అభిప్రాయపడ్డారు.
నటుడు సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, “ఇంత అద్భుతమైన థియేటర్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. స్క్రీన్, సౌండ్, వాతావరణం చాలా నచ్చాయి. ప్రేక్షకులు తప్పకుండా ఇక్కడికి వస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు కూడా థియేటర్ నిర్మాణానికి అభినందనలు తెలియజేశారు.
విజ్ఞాన్ యార్లగడ్డ మాట్లాడుతూ, “కాన్‌ప్లెక్స్ సినిమాస్ గుజరాత్లో ప్రసిద్ధి చెందిన బ్రాండ్. దేశవ్యాప్తంగా 250కి పైగా స్క్రీన్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇది మా తొలి థియేటర్. మేము ముగ్గురం యూఎస్‌లో చదువుకుని, ప్రేక్షకులకు లగ్జరీ సీటింగ్, అద్భుతమైన సినిమాటిక్ అనుభవం అందించాలన్న లక్ష్యంతో ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం మూడు స్క్రీన్లలో 171 సీటింగ్ కెపాసిటీ ఉంది. త్వరలోనే రెండు స్క్రీన్లు పెంచబోతున్నాం” అని తెలిపారు.
అదనంగా, “భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరిన్ని ఏరియాల్లో కాన్‌ప్లెక్స్ సినిమాస్‌ను విస్తరించాలనుకుంటున్నాం. ప్రతి పెద్ద సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోను మా థియేటర్లోనే లాంఛ్ చేస్తాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాతో ఈ థియేటర్ ప్రారంభం అవ్వడం మా అదృష్టం” అని అన్నారు. ప్రేక్షకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త మల్టీప్లెక్స్ లభించడం హైదరాబాద్ సినీప్రియులకు ఆనందం కలిగించింది.