
రొమారియో షెపర్డ్ సెన్సేషన్: ఒక్క బంతికి 20 పరుగులు!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025)లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ అదరగొట్టే ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున కూడా ఆడిన రొమారియో, ఇప్పుడు గయానా అమెజాన్ వారియర్స్ తరఫున అద్భుతమైన ఆటతీరును చూపిస్తున్నాడు. సెయింట్ లూసియాతో జరిగిన తాజా మ్యాచ్‌లో ఆయన చరిత్ర సృష్టించాడు.
15వ ఓవర్లో బౌలర్ థామస్ వేసిన మూడో బంతి నోబాల్‌గా తేలింది. ఆ బంతికి రొమారియో పరుగులేమీ చేయకపోయినా, అదనపు బంతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తర్వాత వేసిన బంతిని సిక్సర్‌గా మలిచాడు. అయితే ఆ బంతి కూడా నోబాల్‌గా తేలడంతో మరో అదనపు బంతి లభించింది. దానిని కూడా సిక్సర్‌గా కొట్టిన రొమారియో, మూడో అదనపు బంతినీ స్టాండ్స్‌లోకి పంపాడు.
దీంతో ఒక్క బంతి కౌంట్లోనే రొమారియో మూడు వరుస సిక్సర్లు కొట్టి మొత్తం 20 పరుగులు సాధించాడు. ఈ ఘనతతో అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో రొమారియో వీడియోలు ట్రెండ్ అవుతుండగా, క్రికెట్ అభిమానులు ఆయన పవర్ హిట్టింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఆ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రొమారియో, 34 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. అందులో 7 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. తన దూకుడు ఆటతీరుతో గయానా అమెజాన్ వారియర్స్ విజయానికి కీలక పాత్ర పోషించాడు.
గత ఐపీఎల్లో కూడా రొమారియో తన దాడి ఆటతో వార్తల్లో నిలిచాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, జైస్వాల్ తర్వాత అత్యంత వేగవంతమైన హాఫ్‌సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. రొమారియో ఈ సీజన్లో కూడా తన అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరిస్తున్నాడు.


