
కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ గుణాలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విలువలను తన జీవితం ద్వారా ప్రపంచానికి చూపించి, పేదల, రోగుల, అనాథల సేవలో తన జీవితాన్నే అర్పించిన మహోన్నత మానవతావాది మదర్ థెరెసా గారి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకోవడం మనందరి కర్తవ్యంగా భావించాలి.
మదర్ థెరెసా గారి జీవితం సర్వస్వం త్యాగానికి, సేవాభావానికి ప్రతీక. పేదరికంలో, నిరాశ్రయతలో, వ్యాధులతో బాధపడుతున్నవారికి తల్లిలా అండగా నిలబడి, వారిని ఆదుకున్న మహనీయురాలు ఆమె. సమాజంలోని ప్రతి వర్గం, ప్రతి మానవుడికి మానవత్వం, ప్రేమ, సహాయం పంచడం ఎంత ప్రధానమో తన సాహసోపేతమైన కృషి ద్వారా నిరూపించారు.
ఆమె స్థాపించిన “మిషనరీస్ ఆఫ్ చారిటీ” సంస్థ ద్వారా లక్షలాది పేదలకు, రోగులకు, అనాధలకు ఆశ్రయం లభించింది. కేవలం సేవకే అంకితభావంతో పనిచేసి, కష్టాలు, ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయని మదర్ థెరెసా గారి త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం.
మదర్ థెరెసా గారి జీవితం మనకు మానవత్వం ఎంత గొప్పదో, సేవ ఎంత పవిత్రమో తెలియజేస్తుంది. సమాజంలో బలహీన వర్గాల పట్ల కరుణ, సహానుభూతి చూపడం మనందరి కర్తవ్యమని ఆమె ఆచరణలో చూపించారు. ఇలాంటి సేవామూర్తులు సమాజాన్ని ముందుకు నడిపే వెలుగుదారులుగా నిలుస్తారు.
మదర్ థెరెసా జయంతి సందర్భం మనందరికీ ప్రజాసేవ పట్ల స్పూర్తిని కలిగించాలి. ఆమె చూపిన మార్గంలో నడుస్తూ, సహాయం అవసరమైన వారికి చేయూతనివ్వడం, ప్రేమ, కరుణతో సమాజాన్ని మరింత అందంగా మార్చడం మన ప్రతిఒక్కరి బాధ్యత. ఆమె ఆత్మకు ప్రణామాలు, ఆమె సిద్ధాంతాలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు.


