
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్న సమయంలో వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ను విడుదల చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు ప్రాంతాల్లో పడతాయని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టంగా సూచించింది.
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రకారం రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా చెట్ల క్రింద, శిథిల భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని ప్రజలకు సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదని ప్రత్యేకంగా హితవు పలికారు.
సోమవారం (25-08-25) న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపారు. మంగళవారం (26-08-25) న ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గోదావరి జిల్లాలు, ఏలూరు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.
బుధవారం (27-08-25) న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుని వాతావరణ శాఖ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.


