
“పరోపకారం పరమో ధర్మః“ అనేది మన భారతీయ సంస్కృతి, ధర్మం యొక్క మూలసారం. సమాజంలోని ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం కృషి చేయడం మన సంస్కారంలో ఒక అద్భుతమైన సంప్రదాయం. వ్యక్తిగత సుఖసంతోషాల కంటే సమాజానికి సేవ చేయడమే మన పూర్వీకులు ఎప్పటినుంచో మన్ననీయమైన కర్తవ్యంగా భావించారు. అందుకే మన భూమి “పుణ్యభూమి”గా కీర్తించబడింది. వ్యక్తి అభివృద్ధి సమాజ అభివృద్ధితో ముడిపడి ఉందని మన సంస్కృతి మాకు నేర్పింది.
ఈ స్ఫూర్తితోనే “జన్మభూమి” వంటి పలు కార్యక్రమాలను ప్రారంభించి సమాజంలో మార్పుకు నాంది పలికాం. ఆ ఆలోచనలో భాగంగా నేడు “జీరో పావర్టీ – పీ4” కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఈ ప్రణాళిక ద్వారా పేదరిక నిర్మూలనతో పాటు ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాలను కల్పించడం లక్ష్యం. ఈ కార్యక్రమానికి వస్తున్న స్పందన మనకు ఎంతో సంతృప్తినిస్తోంది. పీ4 ప్రణాళిక సమాజంలో పేద, మధ్యతరగతి, ధనవంతుల మధ్య సమతుల్యతను సాధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఇటీవల ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి 121 కిలోల బంగారం విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడం మనకు గర్వకారణం. ఇలాంటి గొప్ప విరాళాలు టీటీడీ చేపట్టే విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలకు విశేషమైన సహాయాన్ని అందిస్తాయి. సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో ఇలాంటి దాతృత్వం అమూల్యం.
సంపద సంపాదించడం ముఖ్యమైనా, దానిని సమాజానికి తిరిగి ఇవ్వడం అత్యంత గొప్ప సంతృప్తి ఇస్తుంది. ధనాన్ని సమాజానికి వెచ్చించడం ద్వారా కలిగే ఆనందం, సంతోషం వర్ణనాతీతం. ఇలాంటి ఆదర్శవంతమైన దాతృత్వం సమాజంలో కొత్త మార్పులకు పునాది వేస్తుంది.
అందువల్ల సమాజంలో సంపద సృష్టించిన ప్రతి ఒక్కరూ మంచి మనసుతో సమాజానికి తిరిగి వెచ్చించేందుకు ముందుకు రావాలి. ఇది ఒక గొప్ప ఆదర్శంగా నిలిచి, రాబోయే తరాలకు స్పూర్తిగా మారుతుంది. “పరోపకారం పరమో ధర్మః” అనే భావనతోనే జీరో పావర్టీ-పీ4 కార్యక్రమం సమాజంలో సానుకూలమైన మార్పు తేవడమే లక్ష్యం.


