
గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె (Federation Strike) పరిష్కారం దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. బుధవారం ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, ఫెడరేషన్ పెద్దలు ఒకే వేదికపై సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సమావేశం దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగి, పరిశ్రమ భవిష్యత్తు, కార్మికుల సంక్షేమం, నిర్మాతల సమస్యలు వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి. చర్చల అనంతరం తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (TFDC) అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర ప్రసాద్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ మీడియా ముందు హాజరై వివరాలు అందించారు.
దిల్ రాజు మాట్లాడుతూ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని, అందరి ఉద్దేశం సినిమా పరిశ్రమకు మేలు చేకూర్చడమేనని తెలిపారు. 2018, 2022 సంవత్సరాల్లో నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య కుదిరిన కొన్ని వర్కింగ్ కండిషన్లు ఇంకా అమలు కాలేదని, వాటిని వెంటనే అమలు చేయాలని నిర్మాతలు కోరినట్టు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరేషన్ ప్రధాన డిమాండ్ వేతనాల పెంపు కావడంతో, దానిపై విస్తృత చర్చలు జరిపామని వివరించారు.
చర్చల ఫలితంగా రూ. 2000 లోపు వేతనం పొందుతున్న వారికి వారు కోరిన శాతం మేర పెంపు ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారని తెలిపారు. అంతకంటే ఎక్కువ వేతనం పొందేవారికి వేరే శాతం పెంపు ఇవ్వాలని కూడా నిర్ణయించారని చెప్పారు. ఈ ప్రతిపాదనపై ఫెడరేషన్ తమ యూనియన్లతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని దిల్ రాజు వెల్లడించారు.
గతంలో కుదిరిన వర్కింగ్ కండిషన్లు, ప్రస్తుత వేతనాల పెంపులో తేడాలు వంటి అంశాలను సమావేశంలో స్పష్టంగా చర్చించామని ఆయన తెలిపారు. ఇది కేవలం మొదటి దశ చర్చ మాత్రమేనని, కానీ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరగడం మంచి సంకేతమని అన్నారు.
ఇప్పటికైతే ఈ చర్చలు కొనసాగుతాయని స్పష్టమవుతోంది. మరి త్వరలోనే ఫెడరేషన్ సమ్మెకు ముగింపు పలికి, సినీ పరిశ్రమలో సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించబడతాయా అన్నది అందరి ఆసక్తి కేంద్రమైంది.


