
స్టార్ హీరో ధనుష్ 54వ చిత్రం షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డాక్టర్ ఐసరి కె. గణేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘పోర్ తొళిల్’ ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. కథ, సాంకేతిక అంశాలు, నటీనటుల సమతుల్యత ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయని చిత్రబృందం అభిప్రాయపడుతోంది.
సినిమా షూటింగ్ సందర్భంగా తీసిన ఓ స్టిల్‌ను నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అందులో పాత పీసీవో బూత్ నుంచి ధనుష్ ఫోన్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఆ లుక్ అభిమానులలో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా స్ర్కిప్ట్ ఎంతో చక్కగా రూపుదిద్దుకున్నదని, భావోద్వేగాలకు లోనయ్యేలా సన్నివేశాలు ఉన్నాయని సమాచారం.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ధనుష్‌కు ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్. సంగీతం ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జీవీ ప్రకాష్ కంపోజ్ చేస్తున్న ట్యూన్స్ సినిమాకు భారీ ప్లస్ కావొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
నిర్మాత గణేష్ మాట్లాడుతూ “ధనుష్, విఘ్నేష్ రాజా, జీవీ ప్రకాష్ కుమార్ లాంటి ప్రతిభావంతులతో పని చేయడం సంతోషకరం. మా బ్యానర్‌లో ప్రతి సినిమా నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాం. ‘డి-54’ సినిమాకు ప్రత్యేకమైన కథ ఉంది. ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని అందిస్తుంది,” అని చెప్పారు.
ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. అభిమానుల్లో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘డి-54’ నిజంగానే ఎంతో ప్రత్యేకమైన సినిమా అవుతుందనడంలో సందేహం లేదు.


