
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్ విజయంపై ఇచ్చిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మోదీ పేర్కొన్నట్లుగా, త్రివిధ దళాలకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చినందువల్లే సైన్యం పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగలిగిందన్నారు. ఈ విజయంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో భారత్ తన దృఢ సంకల్పాన్ని చాటిందని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ పహల్గాం ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ఇచ్చిన ఘాటు ప్రతిస్పందన అని మోదీ వివరించారు. ఊహలకు అందని విధంగా టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు తెలిపారు. భారత సైనికుల ధైర్యసాహసాలు, విజయం భారత ప్రజల ఆశీర్వాదంతో సాధ్యమయ్యాయని చెప్పారు. ఈ విజయాన్ని పార్లమెంట్ లో ఉత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని ప్రధాని అన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, దేశం మొత్తంగా తమపై పెట్టిన నమ్మకాన్ని తాము నిలబెట్టుకున్నామన్నారు. “సిందూర్ శపథాన్ని నెరవేర్చాం” అని స్పష్టం చేశారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని, జాతిని ముందు ఉంచడమే తమ ధ్యేయమని అన్నారు.
ప్రపంచంలోని ఏ నాయకుడూ ఆపరేషన్ సిందూర్‌ను ఆపమని చెప్పలేదని, అంతర్జాతీయ మద్దతు కూడా భారత్‌కు లభించిందని మోదీ తెలిపారు. మే 9న జేడీ వాన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకున్నామని వివరించారు.
పాక్ ఎలాంటి కుట్రలు చేసినా భారత ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే ప్రతిస్పందన ఇస్తామని మోదీ స్పష్టంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.


