
ధనుష్, రీచా గంగోపాధ్యాయ జంటగా తెరకెక్కిన “మిస్టర్ కార్తీక్” మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2011లో తమిళంలో “మయక్కమ్ ఎన్న”గా విడుదలై విజయం సాధించింది. 2016లో “మిస్టర్ కార్తీక్” పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ధనుష్ నటనకు, డైరెక్షన్‌కు ప్రత్యేక ప్రశంసలు వచ్చాయి.
ఈ సినిమాను ధనుష్ పుట్టినరోజు (జూలై 27) సందర్భంగా థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఓం శివగంగా ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై శ్రీమతి కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో, కాడబోయిన బాబురావు తెలుగులో ఈ సినిమాను మరోసారి తెరపైకి తీసుకురాబోతున్నారు.
సినిమాలో హీరో అనారోగ్యంతో బాధపడుతూ, భార్య ప్రేమతో చూసుకునే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను చలింపజేస్తాయి. సెల్వ రాఘవన్ రూపొందించిన ప్రతి సన్నివేశం సున్నితమైన భావోద్వేగాలతో నిండినది. రీచా పాత్ర భర్తపై చూపిన ప్రేమను, మద్దతును హృదయాన్ని తాకేలా చూపించారు.
ఇటీవల తమిళంలో ఈ సినిమాను రీ-రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేస్తుందన్న నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు.
ప్రేక్షకులకు మిస్టర్ కార్తీక్ ఓ భావోద్వేగ ప్రయాణంగా మిగిలిపోయే చిత్రం. ధనుష్ అభినయానికి అభిమానులు మరోసారి ఫిదా అవుతారనే అంచనాలు ఉన్నాయి. రీ-రిలీజ్ ద్వారా ఈ చిత్రం కొత్త తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు.