
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులలో విపరీతమైన ఉత్సాహం కనిపించడం సర్వసాధారణం. ఆయన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇకపోతే చిరు హిట్ డైరెక్టర్‌తో కలిసి చేస్తున్నట్లైతే ఆ అంచనాలు మరింత పెరిగిపోతాయి. ప్రస్తుతం చిరంజీవి హీరోగా, డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న “విశ్వంభర” సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. చిరుకు జోడిగా త్రిష నటిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్లు ప్రేక్షకుల మెప్పు పొందాయి. అయితే సినిమా విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకపోయినా, టీజర్లు, పోస్టర్లతో హైప్ మాత్రం బాగానే పెంచారు. తాజాగా దర్శకుడు వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో విశ్వంభర కథతో పాటు ముఖ్య విషయాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో మైథలాజికల్ ఫాంటసీగా రూపొందనుంది.
వశిష్ఠ వెల్లడించిన ప్రకారం, “మొత్తం 14 లోకాలు ఉంటాయి. పైన 7, కింద 7. వీటిలో సత్యలోకం, బ్రహ్మలోకం ప్రధానమైనవి. సత్యలోకంలో ఉన్న హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి వెళ్లి ఆమెను భూమిపైకి తీసుకురావడమే కథ” అని చెప్పారు. ఈ కాన్సెప్ట్ నిజంగా ఆసక్తికరంగా ఉంది.
ఈ కథ నేపథ్యంలో భారీ సెట్లను ప్రత్యేకంగా నిర్మించారట. సత్యలోకం కోసం ప్రత్యేకమైన సెటప్ వేసి, ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ అందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విజువల్ స్పెక్టాకిల్ కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించారు. చిరు పాత్ర, కథా నేపథ్యం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. విశ్వంభర ఒక పాన్-ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారని సమాచారం. చిరు మరోసారి మైథాలజికల్ ఫాంటసీ మూవీ ద్వారా తన స్టార్‌డమ్‌ను మరో మెట్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాపై మెగా అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు.