
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశం సీఎం క్యాంపు కార్యాలయం ఉండవల్లిలో జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో, పార్లమెంట్లో ఏపీ తరపున తగిన ప్రాతినిధ్యం కోసం ముఖ్యమంత్రి ఎంపీలకు వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ సమావేశంలో తొమ్మిది ముఖ్య అంశాలను చర్చిస్తున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పరిష్కారాలు, కేంద్ర సహాయంపై రాష్ట్ర ఆశల నేపథ్యంలో ఎలాంటి సన్నద్ధత ఉండాలో చర్చ జరిగింది. ముఖ్యంగా పోలవరం, హంద్రీనీవా, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రంపై ఎలా ఒత్తిడి తెచ్చేది అనే దానిపై చర్చ సాగింది.
సమావేశంలో మరో కీలక అంశం – మహిళా ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్య ప్రచారాల నివారణపై చర్చ సాగింది. అలాగే, కేంద్ర పథకాల కింద రుణాల మంజూరులో జాప్యం, గుంపుల నియంత్రణలో లోపాలు వంటి అంశాలపై కూడా టీడీపీ ఎంపీలు అభిప్రాయాలు వెల్లడించారు.
అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను కేంద్రానికి సమర్పించే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించారు. అంతేగాక, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పార్లమెంటు వేదికగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరిగింది.
ఇటీవల మామిడి ధరలు పడిపోవడంతో రైతులకు ఎదురవుతున్న నష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అంశం కూడా చర్చకు వచ్చింది. టీడీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో సమర్థవంతంగా పోరాడేలా సమావేశంలో వ్యూహాలు రూపొందించారు.