
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సాధారణ ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుండగా, ఇప్పుడు కేవలం రూ.100తో గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ విధానం ద్వారా రూ. 10 లక్షల లోపు విలువ గల భూములకు రూ. 100 మాత్రమే స్టాంప్ డ్యూటీగా వసూలు చేస్తారు. ఆస్తి విలువ 10 లక్షలకంటే ఎక్కువైతే రూ. 1000 వరకు ఫీజు వసూలు చేస్తారు. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గత ఏడాదిలో ప్రభుత్వం 55,000 పైగా ఫిర్యాదులను స్వీకరించింది.
అనేక కుటుంబాలు తల్లిదండ్రుల మరణం అనంతరం వారసత్వంగా భూములు పొందినప్పటికీ, సరైన మ్యుటేషన్ లేకపోవడంతో భూముల రికార్డుల్లో ఇంకా మృతుల పేర్లు కొనసాగుతున్నాయి. ఇది భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలకు దారితీస్తోంది. ఇప్పుడు సచివాలయాల్లో మరణ ధృవీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆధారంగా డిజిటల్ అసిస్టెంట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడతారు.
ఈ విధానం ద్వారా భూముల రికార్డులు ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతాయి. వెంటనే ఈ–పాస్‌బుక్ జారీ చేస్తారు. అంతేకాకుండా, ఈ-కేవైసీ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించి మార్గదర్శకాలు ఇవ్వగా, రెవెన్యూ శాఖ త్వరలో పూర్తిస్థాయిలో అమలుకు సిద్ధమవుతోంది.
ఇదంతా స్థానిక సబ్ రిజిస్ట్రార్ పర్యవేక్షణలో జరగనుంది. డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణతో ఈ విధానాన్ని మరింత ప్రామాణికంగా రూపొందించనున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం గందరగోళంగా ప్రవేశపెట్టిన దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు భిన్నంగా, ఈ నిర్ణయం సుసంపన్నంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.


