
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం (జూలై 03) ఘనా దేశానికి చేరుకున్నారు. ఘనా రాజధాని అక్రాలో ఉన్న విమానాశ్రయంలో ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా స్వయంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. మూడు దశాబ్దాల తర్వాత భారతదేశ ప్రధాని ఘనాను సందర్శించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. మోదీకి ఘన స్వాగతం లభించింది.
ఘనాలో ప్రధాని మోదీకి గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్), 21 తుపాకీ గౌరవ గర్జనలతో ఘన సత్కారం అందించారు. ఇది మోదీకి మాత్రమే కాదు, భారతదేశానికి కూడా గౌరవం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆక్రాలోని హోటల్‌కు చేరుకున్నప్పుడు అక్కడ ప్రత్యక్షమైన ఘనా పిల్లల బృందం భారత త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి “హరే రామ హరే కృష్ణ” నినాదాలతో ఆయనకు ఉత్సాహంగా స్వాగతం పలకడం ఆకట్టుకుంది.
భారతీయ ప్రవాసులు పెద్ద ఎత్తున అక్రాలో సమావేశమయ్యారు. ప్రధాని మోదీని చూడటానికి, ఆయన ప్రసంగాన్ని వినటానికి ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. ఈ పర్యటనలో భారత్-ఘనా మధ్య వ్యాపార, విద్య, ఆరోగ్య, సాంకేతిక రంగాల్లో సహకార ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి. మోదీ అధికారిక కార్యక్రమాలకు ముందు అక్కడి భారతీయులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ప్రధాని మోదీకి ఘనా ప్రభుత్వం అత్యున్నత గౌరవంగా పరిగణించే ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు అందుకోవడం ద్వారా మోదీ ఘనదేశ చరిత్రలోకెళ్లారు. ఇది భారత్-ఘనా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ పర్యటనలో మోదీ ఐదు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశను ఘనాలో పూర్తి చేశారు. భారత ప్రధాని పర్యటన ద్వారా ఇరు దేశాల మైత్రిని, సంస్కృతిగత, ఆర్థిక సంబంధాలను మరింత అభివృద్ధి చేయడం దీని ప్రధాన లక్ష్యమని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.


