
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కూలీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన దర్శకత్వ శైలిలో మాస్, యాక్షన్, ఎమోషన్ మేళవింపు ఉండటంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులకు సినిమాను అందించేందుకు డి. సురేశ్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు కలిసి భారీ ధరకు తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్ ‘చికిటు’ను విడుదల చేసింది చిత్ర బృందం. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాట అత్యంత ఉత్సాహభరితంగా సాగుతుంది. ఈ గీతంలో రజనీకాంత్ తన ప్రత్యేకమైన ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వింటేజ్ స్టైల్లో కూర్చిన స్టెప్పులు అభిమానుల్ని ఆనందింపజేశాయి.
ఈ పాటలోని లిరిక్స్‌ను అరివు రాసి, పాటను అనిరుధ్‌తో పాటు ప్రముఖ నటుడు టి. రాజేందర్ పాడటం విశేషం. పాటలో వారి ఉత్సాహం స్పష్టంగా కనిపించి ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను తీసుకువచ్చింది. పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
మొత్తానికి ‘కూలీ’ సినిమా విశేషమైన తారాగణం, మాస్ డైరెక్షన్, మ్యూజిక్ కలయికతో భారీ హిట్‌గా నిలవాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో రజనీకాంత్ మరోసారి తన సత్తా ఏంటో చూపించనున్నారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.


