
మిడిల్ క్లాస్ ప్రజల కలల కారుగా పేరుగాంచిన టాటా నానో మళ్లీ కొత్త రూపంలో రాబోతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతంలో చౌక ధరలో అందుబాటులోకి వచ్చిన ఈ కారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్షన్‌గా (Tata Nano EV 2025) తిరిగి రానుందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఆగస్టు 2026 నాటికి ఈ కారు మార్కెట్లోకి వస్తుందని పుకార్లు వినిపిస్తున్నా, ఇప్పటి వరకు టాటా మోటార్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అయినా, ఈవీ మార్కెట్లో నానో వర్షన్ రావడం వినియోగదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ కారు వస్తే, మధ్యతరగతి ప్రజల కోసం సరసమైన ధరలో మంచి మైలేజ్ కలిగిన ఎలక్ట్రిక్ వాహనంగా నిలవనుంది. పెరిగిపోయిన ఇంధన ధరల మధ్య ఎలక్ట్రిక్ వాహనాలే భవిష్యత్తని భావిస్తున్న తరుణంలో, టాటా నానో ఈవీ ఒక చక్కటి ఎంపిక అవుతుంది. ప్రత్యేకించి నగరాలలో రోజూ ప్రయాణించే వారికి ఇది బడ్జెట్‌కు తగిన, అవసరాలకు సరిపోయే వాహనంగా ఉపయోగపడుతుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, నానో ఈవీ 7 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, 6 స్పీకర్ల సౌండ్ సిస్టమ్ లాంటి ఆధునిక సదుపాయాలతో రాబోతుందని అంచనా. సేఫ్టీ పరంగా ABS, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-రోల్ బార్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇవి బడ్జెట్ సెగ్మెంట్లో చాలా అరుదైన అంశాలు కావడం విశేషం.
బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే, ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు 250–260 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని చెబుతున్నారు. టాటా ఇప్పటికే నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ వంటి విజయవంతమైన ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో నానో ఈవీ కూడా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ధర పరంగా చూస్తే, నానో ఈవీ రూ. 5–6 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఇది మధ్యతరగతి ప్రజలకు మళ్ళీ సులభంగా అందుబాటులో ఉండే కారు అవుతుంది. తక్కువ ఖర్చుతో, అధిక ప్రయోజనాలు అందించే ఈ కారుకు మంచి ఆదరణ లభించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక టాటా మోటార్స్ అధికారిక ప్రకటన కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు


