
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పెట్టుబడులు, మౌలిక వసతులు, భూ కేటాయింపులు, పాలసీ నిర్ణయాలపై క్యాబినెట్ చర్చించనుంది. సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కేబినెట్ సమావేశంలో 7వ SIPBలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 28,546 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఇవ్వనున్నారు. ఇందులో వైజాగ్‌లో కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటుకు సంబంధించి చర్చ జరుగుతుంది. అలాగే అమరావతిలో 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 1052 కోట్లతో టెండర్లకు అనుమతినిచ్చే అంశం ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్‌ను నేషనల్ హైవే 16కు కలిపేందుకు రూ. 682 కోట్లతో టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో పలు సంస్థలకు భూమి కేటాయింపులు, రెండో దశ అమరావతి ల్యాండ్ పూలింగ్, పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలు కూడా క్యాబినెట్‌లో చర్చకు రానున్నాయి. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై స్పష్టత తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. రెండు కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుపైనా చర్చ జరుగుతుంది.
ముఖ్యంగా, ఏరోస్పేస్ & డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు రప్పించేందుకు రూపొందిస్తున్న కొత్త పాలసీపై చర్చించనున్నారు. ఇప్పటికే DRDO ఎక్స్‌లెంట్ సెంటర్ ఏర్పాటు, మడకశిరలో భారత్ ఫోర్జ్, బీఎండబ్ల్యూ సంస్థల ప్రాజెక్టులకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు ఈ రంగానికి సంబంధించిన కార్యాచరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, రాష్ట్రాన్ని రక్షణ మరియు అంతరిక్ష రంగాల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న దిశగా 4.0 ఏరోస్పేస్-డిఫెన్స్ పాలసీ రూపొందించాలన్న లక్ష్యాన్ని స్పష్టంగా వెల్లడించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో దేశం సాధించిన విజయాలను ఉదహరిస్తూ, అదే తరహా సాంకేతికతను వాణిజ్యోన్ముఖ పరిశోధనల ద్వారా ప్రజల జీవన విధానంలోకి తీసుకురావాలన్నారు. దీంతో పెట్టుబడులు మరియు పరిశోధన అవకాశాలు పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.