
కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం గడిపిన పదకొండేళ్ల పాలనను “స్వర్ణయుగం”గా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వ మూడవ శాసన కాలం ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా, సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. చెక్కుచెదరని సంకల్పం, అవిశ్రాంత కృషి, ప్రజాసేవ పట్ల అంకితభావంతో కూడిన పాలనను ఆయన ప్రశంసించారు.
ఈ పదకొండేళ్లలో దేశం ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక న్యాయం, సాంస్కృతిక గౌరవం, జాతీయ భద్రత వంటి కీలక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని అమిత్షా వ్యాఖ్యానించారు. బలమైన నాయకత్వం, దృఢ సంకల్పం, ప్రజల పట్ల నిబద్ధత ఉంటే సుపరిపాలన సాధ్యమవుతుందన్న సందేశాన్ని మోదీ ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చిందన్నారు. 2014 నాటి పరిస్థితులు చాలా దయనీయంగా ఉండేవని, నాయకత్వ లోపం, విధానపరమైన అస్పష్టత, అవినీతి అలముకున్న పాలన నుంచి దేశాన్ని బయటపెట్టిన ఘనత మోదీదేనని గుర్తు చేశారు.
రైతుల, మహిళల, వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. బుజ్జగింపు రాజకీయాలకు బదులు ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ అనే నినాదంతో మోదీ ప్రభుత్వం దేశాన్ని ముందుకు నడిపించిందని చెప్పారు.
జాతీయ భద్రత పరంగా చేసిన ప్రగతిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, నక్సలిజం చివరి దశలో ఉందని, జమ్మూకశ్మీర్లో శాంతి పునరుద్ధరించామని, ఈశాన్య భారతదేశంలో ఉగ్రవాదానికి చెక్ పెట్టామని వివరించారు. అవసరమైతే శత్రు భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాదాన్ని తరిమికొట్టే సాహసాన్ని భారత్ చూపుతోందని చెప్పారు. మోదీ 3.0 హయాంలో అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు అన్ని రంగాల్లో వేగంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాను ప్రపంచ నెంబర్ వన్ గమ్యంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యమన్నారు