
‘సలార్’, ‘కల్కి 2898 ఏ.డి’ వంటి విజయం సాధించిన ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా సినిమా ‘రాజా సాబ్’ (Raja Saab) పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సారథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ పలుమార్లు ఆలస్యం కావడంతో సినిమా చివరి దశలోనే నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రేమికులు తరచూ సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన అప్డేట్ కావాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ ఒత్తిడి నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎట్టకేలకు ‘రాజా సాబ్’ నుంచి ఓ భారీ అప్డేట్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ స్టైలిష్ లుక్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేస్తూ, డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా, జూన్ 16న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలియజేశారు.
ఈ అప్డేట్ రావడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోయింది. ప్రభాస్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫ్యాన్స్ #RajaSaab, #Prabhas అంటూ ట్రెండింగ్ కొనసాగిస్తూ, ట్వీట్లు, మీమ్స్, రీల్ వీడియోలతో తెగ హంగామా చేస్తున్నారు.
తాజాగా వచ్చిన పోస్టర్‌లో ప్రభాస్ ఎనర్జిటిక్ లుక్‌లో కనిపించడం సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఆయనను మాస్ యాంగిల్‌లో చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మారుతి ఈ సినిమాను రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో డిజైన్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ కెరీర్‌లో వేరే రకం గెటప్‌గా ఇది నిలిచిపోతుందనే విశ్వాసం యూనిట్‌లో ఉంది.
ఇప్పటికే రెండు మాస్ బ్లాక్‌బస్టర్లు తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ‘రాజా సాబ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. డిసెంబరులో థియేటర్లలో దుమ్ము రేపేలా ప్రణాళికలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. టీజర్ విడుదల తర్వాత మరిన్ని అప్‌డేట్లు వరుసగా రానున్నాయని సమాచారం.