
ప్రపంచ క్రికెట్‌లో అతి పెద్ద టీ20 లీగ్‌గా నిలిచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ తుది అంకానికి చేరుకుంది. లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈరోజు (మంగళవారం) జరిగే గ్రాండ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) టైటిల్ కోసం తలపడనున్నాయి. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో లీగ్ వారం పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
బెంగళూరు ఇది నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్ చేరినా టైటిల్ దక్కలేదు. కానీ ఈసారి ‘ఈ సాలా కప్ నమ్దే’ నినాదం నెరవేర్చాలన్న ఆశాభావంతో అభిమానులు భారీగా మద్దతు ఇస్తున్నారు. స్టేడియంలో విరాట్ ఫ్యాన్స్ నెంబర్ 18 జెర్సీలతో సందడి చేయనున్నారు. బెంగళూరులో రెస్టారెంట్లు, పబ్స్‌లు ఫైనల్ మ్యాచ్ వీక్షణానికి సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో, క్వాలిఫయర్-1లో బెంగళూరుకే ఓడిన పంజాబ్ కింగ్స్ తిరిగి అదే జట్టుతో తుది పోరుకు సిద్ధమవుతోంది.
పంజాబ్ 2014 తర్వాత ఫైనల్‌కు చేరిన ఈ అవకాశాన్ని గట్టిగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసిన ఆత్మవిశ్వాసంతో ఫైనల్ బరిలోకి దిగుతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో మరోసారి తన నాయకత్వాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను రూ.26.75 కోట్ల ధరకు 603 పరుగులు చేసి అంచనాలను మించిపోయాడు. కానీ బౌలింగ్ విభాగంలో జాన్సన్ లేకపోవడం, చాహల్, అర్ష్‌దీప్ ఫామ్ తక్కువగా కనిపించడం దుష్పరిణామం కలిగించవచ్చు.
ఇక ఆర్‌సీబీ జట్టులో ప్రధాన ఆకర్షణ విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు 614 పరుగులతో టాప్-5లో కొనసాగుతున్నాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ బ్యాటింగ్‌కు బలం కలిగిస్తున్నారు. కానీ కెప్టెన్ రజత్ పటీదార్ ఫామ్ లేని విషయం ఆందోళన కలిగిస్తోంది. టిమ్ డేవిడ్ ఫిట్‌నెస్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
బౌలింగ్‌లో జాష్ హాజెల్‌వుడ్ ఇప్పటికే 21 వికెట్లు తీసి అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడితో పాటు యశ్ దయాల్, తుషార్, భువనేశ్వర్ కుమార్‌లు కూడా బెస్ట్ ఫామ్‌లో ఉన్నారు. అన్ని విభాగాల్లో సమతుల్యం చూపుతున్న RCB, ఈసారి టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు మంచి అవకాశం ఉన్నదని విశ్లేషకుల అంచనా. మొత్తానికి, ఈరోజు IPL 2025 ఫైనల్‌లో జెట్టు ఎవరు పట్టుకొంటారన్నది ఆసక్తికరంగా మారింది.