
ఇటీవల భారత పౌరులపై జరిగిన దాడికి ప్రతిగా భారత జవాన్లు పాకిస్తాన్ టెర్రరిస్టుల క్యాంపులపై జరిపిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తిగా దేశభక్తి ప్రధానంగా రూపొందిన పాటను విడుదల చేశారు. ఈ గీతాన్ని ఆరోగ్య డైట్ స్పెషలిస్ట్ లక్ష్మణ్ పూడి స్వయంగా రచించి, పాడి, దానికి దర్శకత్వం వహించారు. ఈ పాటకు ప్రసాద్ రచన అందించగా, రమేష్ సంగీతం అందించారు. కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, ఉమా శంకర్ కొరియోగ్రఫీ, మనికంట ఎడిటింగ్, సత్య శ్రీనివాస్ సంగీత సహకారంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశారు.
ఈ పాట లాంచ్ కార్యక్రమానికి జేడీ లక్ష్మీనారాయణ, నటుడు అలీ, మేజర్ ఒబెరాయ్, జేఏసీ చైర్మన్ అంజిబాబు, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, లక్ష్మణ్ పూడి జవాన్లపై గల గౌరవాన్ని ఈ పాట ద్వారా చక్కగా చూపించారని అన్నారు. చిన్నప్పటి నుంచి దేశం కోసం ఏదైనా చేయాలన్న తపన ఆయనలో ఉన్నదని చెప్పారు.
నటుడు అలీ మాట్లాడుతూ, ప్రజల దృష్టిలో మంచి విషయాల కంటే చెడు విషయాలే వేగంగా వ్యాపిస్తాయి. కానీ లక్ష్మణ్ పూడి ఆరోగ్యంపై చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. అంతేకాకుండా ఆయనలో ఉన్న కళా ప్రతిభను ఈ పాట ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారని ప్రశంసించారు.
లక్ష్మణ్ పూడి తన ప్రసంగంలో, ‘‘దేశం కోసం ఏదైనా చేయాలని చిన్నప్పటి నుంచే కల. మిలటరీ మాధవపురం వంటి ప్రాంతాలకు వెళ్లి పాటలు పాడిన అనుభవం నన్ను ప్రభావితం చేసింది. జవాన్లు సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతుంటే, నేనూ దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నా పాత్ర పోషిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఈ పాటను మురళినాయక్ కుటుంబానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. “ఆహారం మాది, ఆరోగ్యం మీది – ఆరోగ్య డైట్” అంటూ లక్ష్మణ్ పూడి తన ఉద్దేశాన్ని ముగించారు. ఈ పాట, ఒక కళాకారుడిగా ఆయనలోని దేశభక్తిని ప్రతిబింబించింది.