
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చలకు కేంద్రబిందువుగా మారింది. అధికారికంగా ప్రకటించిన వీడియో ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండగా, సినిమా అనౌన్స్మెంట్కి వచ్చిన స్పందన చూస్తే ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న క్రేజ్ అర్థమవుతుంది. ఈ సినిమాతో అట్లీ టాలీవుడ్లోకి డెబ్యూతోడుతూ, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో, మార్వెల్ సినిమాల తరహాలో టెక్నికల్‌గా రూపొందుతున్నట్లు టాక్ ఉంది. కథలో ఐదు కథానాయికలకు ప్రాధాన్యం ఉన్నందున, దీపికా పదుకొణే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి తారల పేర్లు ప్రస్తుతానికి వార్తల్లో వినిపిస్తున్నాయి. అలాగే మరో నాయిక పాత్ర కోసం భాగ్యశ్రీ భోర్సేతో చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.
ఇక తాజా రూమర్స్ ప్రకారం, ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో బన్నీ & వేణు శ్రీరామ్ కాంబినేషన్లో రావాల్సిన సినిమాకే ఈ టైటిల్ అనుకున్నారు. అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకపోవడంతో టైటిల్ నిలిచిపోయింది. కానీ అల్లు అర్జున్‌కు ఈ టైటిల్ బాగా నచ్చడంతో అట్లీ ప్రాజెక్ట్‌కి వాడాలని నిర్ణయించినట్లు కథనాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను A22 x A6 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల అట్లీ, అల్లు అర్జున్ మధ్య జరిగిన భేటీలో చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ చర్చలు పూర్తయ్యాయి. సినిమాను జూన్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. కానీ, ఇప్పటివరకు హీరోయిన్ల ఎంపిక లేదా టైటిల్ పై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అందుకే ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం అంతా ఊహాగానాలే. అసలు టైటిల్ ఏమిటి? హీరోయిన్లు ఎవరు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చేదాకా, ఈ వార్తల్ని అభిమానులు ఆసక్తిగా గమనించాల్సిందే.