
కడప జిల్లాలో తెలుగు దేశం పార్టీ మహానాడుకు (TDP Mahanadu 2025) అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమానికి సంబంధించి మంత్రులు, నేతలు కడపకు తరలివస్తున్నారు. ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు మహానాడు ప్రాంగణంలో పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, పార పట్టుకుని మట్టిని చదును చేయడం ద్వారా తన కార్యకర్త హృదయాన్ని చాటారు. వర్షం వల్ల సభా ప్రాంగణంలోకి చేరిన నీటిని తొలగించే పనిలో తాను ముందుండడం విశేషం.
ఇంకొవైపు మంత్రి సవిత సైకిల్ యాత్ర ద్వారా మహానాడుకు పయనమవుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెనుకొండ నుంచి 44 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి సైకిల్‌పై కడపకు బయలుదేరిన ఆమె, స్థానిక కార్యాలయం వద్ద పచ్చ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. వైజంక్షన్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఆమె సైకిల్ తొక్కారు. ఇదిలా ఉండగా, మంత్రి నారా లోకేష్ కూడా ఈ రోజు మహానాడు ప్రాంగణానికి రానున్నారు.
రేపటి నుంచి మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. మొదటి రోజు పార్టీ ప్రతినిధుల సమావేశం, పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరుగనుంది. మంత్రి లోకేష్ ప్రతిపాదించిన ఆరు సూత్రాల్లో మొదటి రెండు సూత్రాలపై చర్చకు దిగనున్నారు. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
రెండో రోజు స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని పార్టీ నేతలు నివాళులు అర్పించనున్నారు. మిగిలిన నాలుగు సూత్రాలపై చర్చ జరిపి, తుదితీర్మానాలు తీసుకోనున్నారు. అనంతరం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం, ప్రసంగం వంటి కార్యక్రమాలు జరుగుతాయి.
మూడవ రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా చరిత్రలో ఇదొక విశేష రాజకీయ సభగా నిలవనుంది.


